ITEACHERZ QUICK VIEW

07 July, 2014

ఐటీ వినియోగంతో పురోగమన దిశలో కేరళ విద్యారంగం :: A.P.U.T.F


విద్యార్థులను IT నిపుణులుగా
తయారు చేయటం కాకుండా, రోజువారీ అభ్యసన
ప్రక్రియలో వినియోగించుకుంటూ ఐటి
విద్యను నేర్పడమే తమ
లక్ష్యం అంటున్నారు కేరళ స్టేట్ IT@School
ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్వర్ సాదత్. అక్టోబర్ మొదటి
వారంలో కేరళ రాష్ట్రంలో పర్యటించిన యుటియఫ్
ప్రతినిధి బృందం తిరువనంతపురంలోని
IT@School రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయాన్ని
సందర్శించి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో
గంటన్నరపాటు సంభాషించారు. ఆ సంభాషణలోని
ముఖ్యాంశాలను క్లుప్తంగా
ఇంటర్వ్యూ రూపంలో ఇస్తున్నాము
యుటియఫ్ : కేరళ రాష్ట్రంలో IT
విద్యను ఎప్పుడు ప్రారంభించారు. ఎలా
అమలు జరుపుతున్నారు?
అన్వర్ : పాఠశాలల్లో IT విద్యను 2003
సంవత్సరంలో ప్రారంభించాము. ప్రస్తుతం 4071
ప్రభుత్వ,ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో
IT విద్య బోధించ బడుతున్నది. రాష్ట్ర
ప్రభుత్వం పాఠశాలల్లో IT విద్యా బోధన
కోసం ప్రత్యేకంగా IT@School అనే
ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్
ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 8 నుండి 12
తరగతుల విద్యార్థులు 15 లక్షలమందికి |ఊ
విద్యను అందజేస్తున్నాము. ఈ
సంవత్సరం 5,6,7 తరగతులలోని మరొక 15
లక్షల మందికి |ఊవిద్యను ఎన్ఎస్ఏ సహకారంతో
అందించనున్నాము.
యుటియఫ్ : IT విద్యను ప్రత్యేక
సబ్జెక్టుగా బోధిస్తున్నారా? టీచర్ను ప్రత్యేకంగా
నియమించారా?
అన్వర్ : లేదు. కంప్యూటర్ విద్య (IT
విద్య)ను ప్రత్యేకంగా బోధించటంలేదు. మా
ప్రాజెక్టు లక్ష్యం కంప్యూటర్
నిపుణులను తయారు చేయటం కాదు.
కంప్యూటర్ ఆధారంగా సమాచార సాంకేతిక
పరిజ్ఞానాన్ని అన్ని సబ్జెక్టులలో వినియోగించుకొని
ఆయా సబ్జెక్టులలో
నైపుణ్యం సంపాదించుకోవటం మా ముఖ్య
ఉద్దేశ్యం. IT విద్య కోసం ప్రత్యేకంగా
ఉపాధ్యాయులను నియమించలేదు. పాఠశాలల్లోని
ఉపాధ్యాయులందరికీ ఐ.టి. విద్యా బోధనలో
శిక్షణనిచ్చాము. మళయాళం, ఇంగ్లీష్, (భాషలు),
గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలోని పాఠ్య
బోధననలో ఐటి వినియోగం పై శిక్షణనిచ్చాము.
ఐ.టి. విద్యా బోధన కోసం ప్రత్యేకంగా
టీచర్లను నియమిస్తే అది ఆ టీచర్కు,
కంప్యూటర్ లాబ్కే పరిమితం అవుతుంది.
సహజంగానే ఇతర టీచర్లు ఐటి వినియోగానికి
దూరంగా ఉంటారనేది మాకున్న అవగాహన అందుకే
మేము అందరు టీచర్లకు ఐటి విద్యను తమ
సబ్జెక్టులలో ఎలా వినియోగించి బోధించాలో శిక్షణ
ఇచ్చాము. ఇది మంచి ఫలితాలనిచ్చింది.
యుటియఫ్ : ఉపాధ్యాయులకు ఎన్ని
రోజులు శిక్షణ ఇస్తారు? ఎవరి ద్వారా ఇస్తారు?
మాడ్యూల్స్ ఏవైనా రూపొందించారా?
అన్వర్ : తొలిదశలో 10 రోజులు ఇవ్వాల్సి
వచ్చింది. కానీ ప్రస్తుతం 6 రోజుల శిక్షణ
సరిపోతున్నది. 5 రోజులు ఐటి విద్య ఒక
రోజు వారి సబ్జెక్టులో ఐటి వినియోగంపై శిక్షణ
ఇస్తాము. IT@School ప్రాజెక్ట్ ద్వారా ఎంపిక
చేయబడిన 150 మంది ఉపాధ్యాయులను మాస్టర్
ట్రైనర్లుగా పిలుస్తాము. వీరికి ముందుగా ఐటి
నిపుణులతో ప్రాజెక్టు స్థాయిలో 10 రోజుల
పాటు శిక్షణ ఇప్పించాము. వీరు రాష్ట్రంలోని
152 సబ్ డిస్ట్రిక్ట్ (డివిజన్) కేంద్రాలలో
ఉపాధ్యాయులందరికీ శిక్షణనిస్తారు. శిక్షణ
కోసం ప్రతి సబ్జెక్టులో ట్రైనింగ్ మాడ్యూల్స్
రూపొందించాము. కేవలం ఐటి విద్యపై శిక్షణే
కాకుండా కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటనెన్స్,
కెపాసిటీ బిల్డింగ్, ఇంటర్నెట్ వినియోగం తదితర
అంశాలపై కూడా శిక్షణనిస్తాము.
యుటియఫ్ : ఈ 6 రోజుల శిక్షణే
ఉపాధ్యాయులకు సరిపోతుందా?
అన్వర్ : సరిపోతుంది. మేము రూపొందించిన
మాడ్యూల్ను బోధించడానికి సబ్జెక్టుపైన
అవగాహన ఉంటే 2 రోజులు చాలు. దీంతో పాటు వారికి
నిరంతరం ఓరియంటేషన్
కల్పించేందుకు IT@School ఆధ్వర్యంలో
ప్రత్యేకంగా విద్యా కార్యక్రమాల కోసమే
"Edusat" అనే చానెల్ కూడా వుంది. దీని ద్వారా
పాఠశాలలతోను అధికారులతోను వీడియో
కాన్ఫరెన్స్లను నిర్వహిస్తాము. మరొక
విశేషమేమంటే విద్యాకార్యక్రమాల
కోసం ''విక్టర్స్''అనే టి.వి. చానెల్ను కూడా
నిర్వహిస్తున్నాము.
యుటియఫ్ : ఒక్కొక్క పాఠశాలకు ఎన్ని
కంప్యూటర్లు ఇచ్చారు?
అన్వర్ : ఒక్కక్క పాఠశాలకు విద్యార్థుల
సంఖ్యను బట్టి 10 నుండి 65
వరకు కంప్యూటర్లు ఇచ్చాము. ప్రతి
స్కూల్కు ప్రింటరు, ల్యాప్టాప్, మల్టీమీడియా
ప్రొజ్టెరు అవసరమైన చోట జనరేటర్ కూడా సరఫరా
చేశాము. 400 పాఠశాలలకు హ్యాండీకామ్లు కూడా
ఇచ్చాము. బిఎస్ఎన్ఎల్ సహకారంతో అన్ని
పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్
సౌకర్యం కల్పించబడింది. యుటియఫ్ : ఈ
పరికరాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎలా
వినియోగిస్తున్నారు.?
అన్వర్ : అన్ని పాఠశాలల్లో చాలా సమర్థవంతంగా
వినియోగిస్తున్నారు. మీకు సమయం ఉంటే కొన్ని
పాఠశాలను సందర్శించి స్వయంగా
పరిశీలించవచ్చు. ప్రతి స్కూల్కు కంప్యూటర్
ల్యాబ్ ఉంటుంది. ప్రతి టీచర్ అవసరాన్ని బట్టి
క్లాస్రూమ్కు ల్యాప్టాప్, ప్రొజెక్టర్ తీసుకువెళ్ళి
పాఠ్య బోధనలో వినియోగించుకుంటారు. ఇంటర్నెట్
ఉండటం వల్ల పాఠ్యాంశాల బోధనకు అవసరమైన
సమాచారాన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా
సేకరించుకుంటారు.
యుటియఫ్ : IT ఆథారిత విద్యా
బోధనకు ఉపాధ్యాయుల సంసిద్ధత /
సహకారం ఎలా వుంది?
అన్వర్ : చక్కగా వుంది. ప్రభుత్వ పాఠశాలల్లో
నమోదు రేటు క్రమంగా తగ్గుతున్న తరుణంలో
ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలనే పట్టుదల
ఉండటం వల్లనూ, పరీక్షలలో ప్రతి
సబ్జెక్టులోను ఐటి విద్యకు సంబంధించిన
ప్రశ్నలకు,
ప్రాక్టికల్స్కు మార్కులు కెటాయించబడటం వల్లనూ,
ఉపాధ్యాయులందరూ ఐటి విద్యా
బోధనకు మానసికంగా సిద్ధమయ్యారు. ఒకసారి
అవగాహన కల్గిన తర్వాత బోధన సులభంగా
ఉండటం వల్ల ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా
సహకరిస్తున్నారు. కొందరైతే వారికిగల
సృజనాత్మకతను జోడించి క్లాస్రూమ్లో ఐటి
వినియోగంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
యుటియఫ్ : ఐటి విద్యకు నిధులు ఎలా
సమకూర్చ బడుతున్నాయి?
అన్వర్ : ఐసిటి ఎడ్యుకేషన్ పేరుతో కేంద్ర
ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు 75%
నిధులను కెటాయిస్తున్నది. మిగిలిన 25%
శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. రాబోయే
5 సం||ల కాలానికి ప్రతి పాఠశాలకు రు.1.33
లక్షలు చొప్పున
నిధులు కెటాయించబడుతున్నాయి. అయితే ఇవి
హైస్కూల్స్ కోసం మాత్రమే పరిమితమైనవి. కానీ
మేము ఎస్ఎస్ఏ సహకారంతో ఈ సంవత్సరం నుండి
యుపిఎస్లలో 5,6,7 తరగతుల
విద్యార్థులకు కూడా ఐటి
విద్యను బోధిస్తున్నాము. మౌలిక వసతుల
కల్పన కోసం పిటిఏ సహకారం కూడా
తీసుకుంటున్నాము.
యుటియఫ్ : కంప్యూటర్ విద్యా బోధనపై
పర్యవేక్షణ ఏమైనా ఉందా?
అన్వర్ : తప్పకుండా ఉంది. రాష్ట్ర స్థాయిలో
IT@School ప్రాజెక్ట్, జిల్లా స్థాయిలో ప్రతి
జిల్లాకు ఒక కో-ఆర్డినేటర్ (వీరూ టీచర్లే), బ్లాక్
స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు, పాఠశాల స్థాయిలో
స్కూల్ కో-ఆర్డినేటర్లు ఉంటారు. కంప్యూటర్ల
నిర్వహణతోపాటు, ఉపాధ్యాయులకు అవసరమైన
సాంకేతిక సహకారాన్ని వీరు అందిస్తారు.
యుటియఫ్ : కంప్యూటర్ల నిర్వహణ,
రిపేర్లు ఎవరు చూస్తారు?
అన్వర్ : మెయింటనెన్స్తోపాటు చిన్న చిన్న
రిపేర్లు స్కూల్ కో-ఆర్డినేటర్లే చూస్తారు. వారికి
ఆ విధంగా శిక్షణ ఇస్తాము. మేజర్ రిపేర్ల
నిర్వహణ కోసం ''కెల్ట్రాన్'' అనే ప్రభుత్వరంగ
సంస్థ సహకారంతో ''హార్డ్ వేర్
క్లినిక్''లను ఏర్పాటు చేశాము. పరిసరాల్లోని
పాఠశాలల నుండి చెడిపోయిన
యంత్రాలను క్లినిక్లకు తీసుకువచ్చి రిపేర్
చేయించుకువెళతారు. గత సంవత్సరం 1000
పాఠశాలలకు సంబంధించిన 8000
కంప్యూటర్లను ఈ క్లినిక్లలో రిపేర్
చేయించాము. ఇందుకోసం అయిన ఖర్చు రు. 1.2
కోట్లు. ఆ విధంగా చేయడం వల్ల సుమారు 12
కోట్లు (10రెట్లు) ఆదా చేయగలిగాము.
యుటియఫ్ : కంప్యూటర్లలో ఏ సాఫ్ట్వేర్
వినియోగిస్తున్నారు?
అన్వర్ : లీనక్స్ ''ఫ్రీ సాఫ్ట్వేర్''.
2005కు పూర్వం మైక్రోసాఫ్ట్ కంపెనీ ''విండోస్''
సాఫ్ట్వేర్ ఉపయోగించే వారం. బహుళజాతి సంస్థ
అయిన ఆ కంపెనీ గుత్తాధిపత్యం వల్ల
సాఫ్ట్వేర్ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో
నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి
వ్యతిరేకంగా కేరళ స్టేట్ టీచర్స్ అసోసియేషన్
(కెఎస్టిఏ) ఫ్రీ సాఫ్ట్వేర్ను వినియోగించాలని
డిమాండ్చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద
ఉద్యమం నిర్వహించింది. ఫలితంగా అప్పటి
యుడిఎఫ్ ప్రభుత్వం 2005 నుండి ఫ్రీ సాఫ్ట్వేర్
వినియోగాన్ని ప్రారంభించింది. 2005-2006
సంవత్సరములలో ఫ్రీ సాఫ్ట్వేర్, విండోస్
రెండూ వినియోగంలో ఉన్నాయి. 2007 నుండి
పూర్తిగా ''ఫ్రీ సాఫ్ట్ వేర్'' మాత్రమే
వినియోగించబడుతున్నది. దీని వల్ల మా
ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది.
వినియోగదారులకు స్వీచ్చ లభించింది.
యుటియఫ్ : కంప్యూటర్ విద్యా బోధనలో ఇతర
రాష్ట్రాలతో పోలిస్తే మీ దగ్గర సమర్థవంతంగా
అమలు జరుగుతుందని భావిస్తున్నారా?
అన్వర్ : అవును.
నేను కాదు బెంగుళూరుకు చెందిన ఐటి ఫర్ చేంజ్
అనే సంస్థ కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఐటి
విద్యా బోధనపై నిర్వహించిన సర్వేలోనే ఈ
విషయం వెల్లడైంది. ఆ రిపోర్టును ఇంటర్నెట్లో
మీరు కూడా చూడవచ్చు.
యుటియఫ్ : ఐటి విద్య మీ వద్ద ఎందుకింత
సమర్థవంతంగా అమలు జరుగుతున్నది?
అన్వర్ : కేవలం ప్రభుత్వ ఆధీనంలో
నిర్వహించబడటం, ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగం,
ఉపాధ్యాయులందరినీ
భాగస్వాములను చేయడం వల్లనే ఇది
సాధ్యమైందనుకుంటాను. ఇతర రాష్ట్రాలలో
ఎన్ఐఐటి లాంటి ఏ ప్రైవేట్ సంస్థ కో-
కాంట్రాక్ట్కు ఇస్తున్నారు. వారు 4,5 ఏళ్ళ
పాటు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో పాఠశాలల్లో
కంప్యూటర్ ల్యాబ్లు నిర్వహిస్తారు. ఐటి
విద్య ఒక ప్రత్యేక సబ్జెక్టుగా వారానికి 2,3
పిరియడ్లు బోధిస్తారు. ఇతర
టీచర్లకు కంప్యూటర్లతోగాని, ఐటి విద్యతోగానీ
సంబంధం వుండదు. ఈ పరిమితమైన శిక్షణతో
విద్యార్థులు కంప్యూటర్ నిపుణులుగా కూడా
తయారు కాలేరు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత
ఐటి టీచర్లు వెళ్ళిపోతారు.
కంప్యూటర్లు సర్వీసింగ్ లేక మూలన
పడతాయి. వాటిని పర్యవేక్షించే నాధుడే వుండడు.
బహుశా ఈ ఇబ్బందులేవీ మాకు లేనందు వల్లనే
మా రాష్ట్రంలో ఐటి విద్య సమర్థవంతంగా
అమలు జరుగుతున్నదని భావిస్తున్నాను.
యుటియఫ్ : విక్టర్స్ (VICTERS) టి.వి.
చానెల్ను కేరళ రాష్ట్ర
ప్రభుత్వం నిర్వహిస్తుందా? ఆ చానెల్లో ఏ
కార్యక్రమాలు ప్రసారం చేస్తారు ?
అన్వర్ : అవును. కేరళ ప్రభుత్వ సంస్థ
IT@School ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో
నిర్వహించబడుతుంది. రోజుకు 17 గంటలు (ఉ||
6 నుండి రా|| 11 గంటల వరకు) విద్యా,
వైజ్ఞానిక, వినోదాత్మక
కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. (టి.వి. ఆన్
చేసి ''విక్టర్స్ చానెల్లో ప్రసారమౌతున్న
కార్యక్రమాన్ని చూపించారు) విక్టర్స్ అంటే
''వర్చ్వల్ క్లాస్రూమ్ టెక్నాలజీ ఆన్ ఎడ్యుశాట్
ఫర్ రూరల్ స్కూల్''. ఈ ఛానెల్లో మళయాళం,
ఇంగ్లీష్ భాషలలో విద్యా
కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. కార్యక్రమాల
రూపకల్పన కోసం ప్రత్యేకంగా స్టూడియో కూడా
వుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
సహకారంతో సందేశశాత్మక
సినిమాలను ప్రసారం చేస్తున్నాము. సినిమా
ప్రసారాన్ని గత వారమే (సెప్టెంబర్ చివరి వారం)
రాష్ట్ర విద్యామంత్రి ఎంఏ బేబి ఆవిష్కరించారు.
జర్మన్ రేడియో ''దోషేవిల్లే''తో 200 గంటల
వీడియో కాంటెంట్ కోసం ఒప్పందం చేసుకున్నాము.
బి.బి.సి.తో కూడా
ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాము. ఇంకా
రాష్ట్ర వ్యాప్తంగా యూత్ పెస్టివల్ సందర్భంగా
10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను లైవ్
ఇస్తాము, పాఠశాలల్లో నిర్వహించే
కార్యక్రమాలను రికార్డు చేసి
అప్పుడప్పుడు ప్రసారం చేస్తుంటాము.
పాఠశాలల్లో విద్యార్థుల చేత సృజనాత్మక
కార్యక్రమాలను రూపొందించేందుకు వీడియో
షూటింగ్ కోసం 400 హైస్కూళ్ళకు ''హ్యాండీ
క్యామ్''లను కూడా ఇచ్చాము.
యుటియఫ్ : ఈ కార్యక్రమాలన్ని
విద్యార్థులకు మాత్రమే పరిమితమా? వారికి ఎలా
అందుబాటులో ఉంటాయి.?
అన్వర్ : విక్టర్స్ చానెల్లో ప్రసారమయ్యే
కార్యక్రమాలు కేవలం విద్యార్థులకు మాత్రమే
పరిమితం కాదు. ఉపాధ్యాయులు,
తల్లిదండ్రులు, సాధారణ ప్రజానీకానికి కూడా
ఉపయోగకరంగాను, ఆసక్తిదాయకంగాను ఉంటాయి.
ఈ చానెల్ను లోకల్ కేబుల్ టివిలలో
ప్రసారం చేస్తున్నందు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా
అందరికీ అందుబాటులో ఉంటున్నది. రండి మా
స్టూడియోను ఒకసారి చూద్దాం. (ప్రాజెక్ట్
కార్యాలయంలోనే ఉన్న ''విక్టర్స్'' టి.వి.
స్టూడియోలోనికి తీసుకువెళ్ళి చూపించారు)
అనంతరం యుటియఫ్ బృందం అభ్యర్ధన
మేరకు తిరువనంతపురం జిల్లా IT@School కో-
ఆర్డినేటర్ సాంబశివన్ను తోడు చేసి వారిని
సమీపంలోని కాటన్ హిల్స్ గవర్నమెంట్ గరల్స్
హైస్కూల్ సందర్శనకు పంపించారు. ఆ పాఠశాలలోని
కంప్యూటర్ ల్యాబ్స్ను పరిశీలించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ చెప్పిన
విషయాలను ప్రత్యక్షంగా గమనించి
ధృవీకరించుకున్నారు.

No comments:

Post a Comment

Popular Posts